లేఖనములు
ఆల్మా 26


26వ అధ్యాయము

అమ్మోన్‌, ప్రభువునందు అతిశయించును—విశ్వాసులు ప్రభువు చేత బలపరచబడి, జ్ఞానము ఇవ్వబడుదురు—విశ్వాసము చేత మనుష్యులు వేల ఆత్మలను పశ్చాత్తాపపడునట్లు చేయవచ్చును—దేవుడు సమస్త శక్తి కలిగియుండి, అన్ని సంగతులను గ్రహించును. సుమారు క్రీ. పూ. 90–77 సం.

1 ఇప్పుడు అతని సహోదరులతో అమ్మోన్‌ పలుకుచున్న మాటలివి: నా సహోదరులు మరియు నా సహోదరులారా, ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, సంతోషించుటకు మనము గొప్ప హేతువును కలిగియున్నాము; ఏలయనగా, దేవుడు మనకు అట్టి గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహించునని జరహేమ్ల దేశము నుండి మనము బయలుదేరినపుడు మనము ఊహించితిమా?

2 ఇప్పుడు నేను అడుగుచున్నాను, ఎంత గొప్ప ఆశీర్వాదములను ఆయన మనకు ఇచ్చెనో మీరు చెప్పగలరా?

3 ఇదిగో నేను మీ కొరకు సమాధానమిచ్చుచున్నాను; మన సహోదరులైన లేమనీయులు అంధకారములో, అనగా మిక్కిలి అంధకారమైన అగాధములో ఉండిరి, కానీ వారిలో ఎందరు దేవుని యొక్క అద్భుతమైన వెలుగును చూచుటకు తేబడియున్నారో చూడుడి. ఇది మనకివ్వబడిన ఆశీర్వాదము, ఈ గొప్ప కార్యము నెరవేర్చుటకు దేవుని చేతులలో మనము సాధనములుగా చేయబడియున్నాము.

4 మరియు వారిలో వేలమంది ఆనందించుచూ దేవుని యొక్క మందలోనికి తేబడియున్నారు.

5 ఇదిగో పొలము పండినది మరియు మీరు ధన్యులు, ఏలయనగా మీరు కొడవలిని ఉపయోగించి మీ బలముతో కోత కోసియున్నారు, అంతేకాక మీరు దినమంతయు పని చేసియున్నారు; మీ పనల సంఖ్యను చూడుడి! అవి వృధా కాకుండునట్లు కొట్లలోనికి కూర్చబడును.

6 అవి అంత్యదినమున తుఫాను చేత కొట్టివేయబడవు లేదా సుడిగాలుల చేత చెదరగొట్టబడవు; కానీ సుడిగాలులు వాటి యొద్దకు ప్రవేశించకుండునట్లు తుఫాను వచ్చినప్పుడు అవి వాటి స్థలములో సమకూర్చబడును; అంతేకాక శత్రువు వాటిని మోసుకొని పోవలెనని కోరిన చోటుకు తీవ్రమైన గాలులతో అవి కొట్టుకొనిపోబడవు.

7 ఇదిగో అవి కోత యజమాని చేతులలో ఉన్నవి మరియు అవి ఆయనవి; అంత్యదినమున ఆయన వారిని లేపును.

8 మన దేవుని నామము స్తుతినొందును గాక; మనము ఆయనను స్తుతించెదము, ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, ఏలయనగా ఆయన నిత్యము నీతిని జరిగించును.

9 మనము జరహేమ్ల దేశము నుండి వచ్చియుండని యెడల, మనకు మిక్కిలి ప్రియులైన ఈ సహోదరులు, మనలను మిక్కిలిగా ప్రేమించిన వారు, ఇంకా మనకు వ్యతిరేకముగా ద్వేషముతో వేధించబడియుండే వారు మరియు దేవునికి అపరిచితులుగా ఉండేవారు.

10 ఇప్పుడు అమ్మోన్‌ ఈ మాటలను చెప్పినప్పుడు, అతని సహోదరుడైన అహరోను అతడిని గద్దించి ఇట్లనెను: అమ్మోన్‌, నీ సంతోషము నిన్ను అతిశయమునకు కొనిపోవునని నేను భయపడుచున్నాను.

11 కానీ అమ్మోన్‌ అతనితో ఇట్లు చెప్పెను: నేను నా శక్తియందు లేదా నా వివేకమందు అతిశయించుట లేదు; కానీ నా సంతోషము సంపూర్ణమైనది, నా హృదయము సంతోషముతో నిండియున్నది మరియు నేను నా దేవుని యందు ఆనందించుచున్నాను.

12 నేను శూన్యుడనని నేనెరుగుదును; నా శక్తికి సంబంధించి నేను బలహీనుడను; కావున నన్ను గూర్చి నేను అతిశయించను, కానీ నా దేవుని గూర్చి అతిశయించెదను, ఏలయనగా ఆయన శక్తియందు నేను సమస్తము చేయగలను; ఇదిగో, ఈ దేశమందు మనము అనేక గొప్ప అద్భుతములను చేసియున్నాము, వాటి నిమిత్తము మనము నిత్యము ఆయన నామమును స్తుతించెదము.

13 మన సహోదరులలో అనేక వేలమందిని నరకపు బాధలనుండి ఆయన విడిపించెను; వారు విమోచించు ప్రేమను కీర్తించుటకు తేబడియున్నారు మరియు ఇది మనయందున్న ఆయన వాక్యము యొక్క శక్తిని బట్టియైయున్నది, కావున మనము సంతోషించుటకు గొప్ప హేతువును కలిగిలేమా?

14 ఆయనను నిత్యము స్తుతించుటకు మనము హేతువు కలిగియున్నాము, ఏలయనగా ఆయన సర్వోన్నతుడగు దేవుడు మరియు మన సహోదరులను నరకపు సంకెళ్ళనుండి విడిపించెను.

15 వారు శాశ్వత అంధకారముతో, నాశనముతో చుట్టబడియుండిరి; కానీ ఆయన వారిని శాశ్వత వెలుగు లోనికి, అనగా శాశ్వత రక్షణలోనికి తెచ్చియున్నాడు; వారు ఆయన యొక్క విస్తారమైన సాటిలేని ప్రేమతో చుట్టబడిరి; ఈ గొప్ప ఆశ్చర్యకార్యము చేయుటకు ఆయన చేతులలో మనము సాధనములుగా యుంటిమి.

16 కావున మనము అతిశయించుదము, ప్రభువు నందు మనము అతిశయించుదము; మనము ఆనందించుదము, ఏలయనగా మన సంతోషము సంపూర్ణమాయెను; మనము మన దేవుడిని నిత్యము స్తుతించెదము. ఇదిగో ప్రభువు నందు ఎవరు ఎక్కువగా అతిశయించెదరు? నరుల సంతానము యెడల ఆయన గొప్ప శక్తిని గూర్చి, ఆయన కనికరమును గూర్చి మరియు ఆయన దీర్ఘశాంతమును గూర్చి ఎవరు అత్యధికముగా చెప్పగలరు? నేననుభవించుచున్న దానిలో అతి చిన్నభాగమును కూడా చెప్పలేనని నేను మీతో చెప్పుచున్నాను.

17 మన భయంకరమైన, పాపపూరితమైన, కలుషితమైన స్థితి నుండి మనలను బయటకు తెచ్చునంత కనికరమును మన దేవుడు కలిగియుండునని ఎవరు ఊహించియుందురు?

18 ఇదిగో, ఆయన సంఘమును నాశనము చేయుటకు కోపముతో మరియు బలమైన బెదిరింపులతో మనము ముందుకు వెళ్ళితిమి.

19 అప్పుడు, ఆయన మనలను భయంకరమైన నాశనమునకు ఎందుకు అప్పగించలేదు? ఆయన న్యాయపు ఖడ్గము మనపై పడునట్లు చేసి, మనలను శాశ్వత నిరాశకు ఎందుకు లోనుకానివ్వలేదు?

20 ఓ, నా ఆత్మ ఆ తలంపునకే దాదాపుగా పారిపోవును. ఇదిగో ఆయన తన న్యాయమును మనపై అమలుపరచలేదు, కానీ మన ఆత్మల రక్షణ కొరకు ఆయన గొప్ప కనికరముతో ఆ మరణము మరియు దౌర్భాగ్యము యొక్క నిత్య అగాధము నుండి మనలను బయటకు తెచ్చెను.

21 ఇప్పుడు నా సహోదరులారా, ప్రకృతి సంబంధియైన ఏ మనుష్యుడు ఈ సంగతులను ఎరుగును? పశ్చాత్తాపపడువారు తప్ప ఈ సంగతులను ఎరుగువారెవ్వరూ లేరని నేను మీతో చెప్పుచున్నాను.

22 పశ్చాత్తాపపడి, విశ్వాసమును అభ్యసించి, సత్‌క్రియలను జరిగించి, ఎడతెగక ప్రార్థన చేయువానికి ు; మన ఈ సహోదరులు పశ్చాత్తాపపడునట్లు చేయుటకు మనకు అనుగ్రహించబడినట్లుగానే వేలమంది ఆత్మలు పశ్చాత్తాపపడునట్లు చేయుటకు అట్టి వానికి అనుగ్రహించబడును.

23 ఇప్పుడు నా సహోదరులారా, మన సహోదరులైన లేమనీయులకు బోధించుటకు మనము నీఫై దేశమునకు వెళ్ళెదమని జరహేమ్ల దేశమందున్న మన సహోదరులకు చెప్పినప్పుడు వారు మనలను చూచి అపహసించిరని మీకు జ్ఞాపకమున్నదా?

24 ఏలయనగా వారు మనతో ఇట్లనిరి: లేమనీయులకు సత్యమును తెలియజేయగలరని మీరు తలంచుచున్నారా? ఎవరి హృదయములు రక్తము చిందించుటయందు సంతోషించునో, ఎవరి దినములు సమస్త దుర్నీతియందు గడపబడినవో, ఎవరి మార్గములు మొదటి నుండి అతిక్రమకారుని మార్గములైయున్నవో అటువంటి మెడబిరుసు జనులైన లేమనీయులను వారి పితరుల యొక్క తప్పుడు ఆచారములను గూర్చి మీరు ఒప్పించగలరని మీరు తలంచుచున్నారా? ఇప్పుడు నా సహోదరులారా, ఇది వారి భాషయైయున్నదని మీకు జ్ఞాపకమున్నదా?

25 వారింకనూ ఇట్లు చెప్పిరి: వారు మనలను మించిపోయి, మనలను నాశనము చేయకుండునట్లు దేశమునుండి మనము వారిని, వారి దుర్నీతిని నాశనము చేయునట్లు వారికి వ్యతిరేకముగా ఆయుధములను తీసుకొందుము.

26 ఇదిగో నా ప్రియమైన సహోదరులారా, మనము అరణ్యములోనికి మన సహోదరులను నాశనము చేయు ఉద్దేశ్యముతో రాలేదు, కానీ బహుశా మనము వారిలో కొన్ని ఆత్మలను రక్షించవచ్చునేమోనను ఉద్దేశ్యముతో వచ్చితిమి.

27 మన హృదయములు కృంగి మనము వెనుదిరగబోవుచున్నప్పుడు, ప్రభువు మనలను ఓదార్చి ఇట్లనెను: మీ సహోదరులైన లేమనీయుల మధ్యకు వెళ్ళుము, మీ శ్రమలను సహనముతో భరించుము, నేను మీకు విజయమునిచ్చెదను.

28 ఇప్పుడు మనము వచ్చి, వారి మధ్య ఉంటిమి; మన బాధలలో మనము సహనము కలిగియుండి, ప్రతి లేమిని అనుభవించితిమి; లోకము యొక్క కనికరములపై—లోకము యొక్క కనికరములపైన మాత్రమే కాక దేవుని యొక్క కనికరములపై ఆధారపడుచూ గృహము నుండి గృహమునకు మనము ప్రయాణించితిమి.

29 మనము వారి గృహములలో ప్రవేశించి, వారికి బోధించితిమి మరియు వారి వీధులలో, వారి కొండలపై, వారి ఆలయములలో, వారి సమాజ మందిరములలో కూడా ప్రవేశించి వారికి బోధించితిమి; మనము వెలుపలకు త్రోసివేయబడి, ఎగతాళి చేయబడి, ఉమ్మివేయబడితిమి మరియు మన చెంపలపై కొట్టబడితిమి; మనము రాళ్ళతో కొట్టబడి, పట్టుకొనబడి, బలమైన త్రాళ్ళతో బంధింపబడి, చెరసాలలో వేయబడితిమి; దేవుని యొక్క శక్తి, వివేకముల చేత మనము తిరిగి విడుదల చేయబడితిమి.

30 మనము అన్నివిధములైన శ్రమలను అనుభవించితిమి మరియు ఇదంతయూ బహుశా కొన్ని ఆత్మలనైనా రక్షించుటలో మనము సాధనముగా ఉండవలెనని చేసితిమి; కనీసము కొంతమందిని రక్షించుటలో మనము సాధనముగా ఉండిన యెడల, మన సంతోషము సంపూర్ణమగునని తలంచితిమి.

31 ఇప్పుడు మనము మన శ్రమల యొక్క ఫలములను చూడగలము; అవి కొద్దిగానున్నవా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను, అవి అనేకమున్నవి; వారి సహోదరుల యెడల మరియు మన యెడల వారికున్న ప్రేమను బట్టి వారి నిజాయితీని గూర్చి మనము సాక్ష్యమివ్వగలము.

32 ఏలయనగా వారి శత్రువు ప్రాణమును తీయుట కంటే వారు తమ ప్రాణములను త్యాగము చేయుటకు కోరిరి మరియు వారి సహోదరుల యెడల వారి ప్రేమను బట్టి వారు తమ యుద్ధ ఆయుధములను భూమియందు లోతుగా పాతిపెట్టిరి.

33 ఇప్పుడు, ఈ దేశమందు అటువంటి గొప్ప ప్రేమ ఎక్కడైనా కలదా? అని నేను మిమ్ములను అడుగుచున్నాను. లేదు, నీఫైయుల మధ్య కూడా లేదని నేను మీతో చెప్పుచున్నాను.

34 ఏలయనగా వారు తమ సహోదరులకు వ్యతిరేకముగా ఆయుధములను తీసుకొందురు; తాము సంహరింపబడుటకు వారు అనుమతించరు. కానీ, వీరిలో ఎంతోమంది తమ ప్రాణములను అర్పించిరి; వారి ప్రేమను బట్టి మరియు పాపము యెడల వారి ద్వేషమును బట్టి వారు తమ దేవుని యొద్దకు వెళ్ళియున్నారని మనము ఎరుగుదుము.

35 ఇప్పుడు మనము సంతోషించుటకు హేతువు కలిగిలేమా? నేను మీతో చెప్పుచున్నాను, లోకారంభము నుండి మనవలే సంతోషించుటకు ఇంత గొప్ప హేతువు కలిగిన మనుష్యులు ఎన్నడూ లేరు; నా సంతోషము నా దేవునియందు అతిశయించునంత అధికమైనది; ఏలయనగా ఆయన సమస్త శక్తి, వివేకము, గ్రహింపును కలిగియున్నాడు; ఆయన అన్ని సంగతులను గ్రహించును మరియు పశ్చాత్తాపపడి ఆయన నామమందు విశ్వసించు వారి రక్షణ కొరకు ఆయన కనికరము కలిగియున్నాడు.

36 ఇప్పుడు ఇది అతిశయించుట అయిన యెడల, అట్లు కూడా నేను అతిశయించెదను; ఏలయనగా ఇదే నా జీవము, నా వెలుగు, నా సంతోషము, నా రక్షణ మరియు శాశ్వత ఆపద నుండి నా విమోచనయై యున్నది. ఇశ్రాయేలు వృక్షము యొక్క కొమ్మయైయుండి, దాని శరీరము నుండి అన్యదేశములో తప్పిపోయిన ఈ జనులను గూర్చి ఆలోచన కలిగియున్న నా దేవుని నామము ధన్యమగునుగాక; నేను చెప్పుచున్నాను, అన్యదేశములో తిరుగులాడు వారమైన మనలను గూర్చి ఆలోచన కలిగియున్న నా దేవుని నామము ధన్యమగునుగాక.

37 ఇప్పుడు నా సహోదరులారా, వారే దేశములో ఉన్నను దేవుడు ప్రతి ఒక్కరిని గూర్చి ఆలోచన కలిగియుండునని, ఆయన తన జనులను లెక్కించునని, ఆయన కనికరము సమస్త భూమిపై ఉన్నదని మనము చూచుచున్నాము. ఇదియే నా సంతోషము మరియు నా గొప్ప కృతజ్ఞతాస్తోత్రము. నా దేవునికి నేను నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్‌.