తన కుమారుడైన కోరియాంటన్కు ఆల్మా యొక్క ఆజ్ఞలు.
39 నుండి 42 అధ్యాయములు కలిగియున్నవి.
39వ అధ్యాయము
లైంగిక పాపము హేయకరమైనది—కోరియాంటన్ యొక్క పాపములు, జోరమీయులు వాక్యమును అంగీకరించకుండునట్లు చేసెను—క్రీస్తు యొక్క విమోచన దానికి ముందు జీవించిన విశ్వాసులను రక్షించుట యందు ప్రతిచర్యను కలిగియున్నది. సుమారు క్రీ. పూ. 74 సం.
1 నా కుమారుడా, నీ సహోదరునికి చెప్పిన దాని కంటే నీకు కొంత ఎక్కువగా నేను చెప్పవలసియున్నది; ఏలయనగా దేవుని ఆజ్ఞలను పాటించుటలో నీ సహోదరుని నిలకడను, అతని విశ్వాస్యతను, శ్రద్ధను నీవు గమనించియుండలేదా? అతడు నీకు మంచి మాదిరిగా ఉండలేదా?
2 జోరమీయుల యొక్క జనుల మధ్య నీ సహోదరుడు లక్ష్యపెట్టినంతగా నీవు నా మాటలను లక్ష్యపెట్టలేదు. ఇప్పుడు నీకు వ్యతిరేకముగా నేను కలిగియున్నది ఇదియే; నీవు నీ బలమందు, జ్ఞానమందు డంబములు పలుకుటకు వెళ్ళియున్నావు.
3 నా కుమారుడా, అంతయు ఇదియే కాదు. నాకు బాధాకరమైన దానిని నీవు చేసియున్నావు; నీవు పరిచర్యను వదిలివేసి, వేశ్యయైన ఇసబెల్ వెనుక లేమనీయుల యొక్క సరిహద్దుల మధ్యనున్న సిరొన్ దేశములోనికి వెళ్ళితివి.
4 ఆమె అనేకుల హృదయాలను కొల్లగొట్టినది; కానీ నా కుమారుడా, ఇది నీ కొరకు సాకు కాదు. నీకు అప్పగించబడిన పరిచర్యను నీవు జరిగించవలసినది.
5 నా కుమారుడా, ఈ క్రియలు ప్రభువు దృష్టిలో హేయకరమని నీవెరుగవా? అంతేకాక నిర్దోషమైన రక్తమును చిందించుట లేదా పరిశుద్ధాత్మను తిరస్కరించుట తప్ప, మిగిలిన అన్ని పాపముల కంటే మిక్కిలి హేయకరమని నీవెరుగవా?
6 ఏలయనగా పరిశుద్ధాత్మ ఒకసారి నీలో నివసించిన తరువాత నీవు అతడిని నిరాకరించిన యెడల మరియు నీవు అతడిని నిరాకరించితివని ఎరిగిన యెడల, అది క్షమించరానట్టి పాపమైయున్నది; దేవుని యొక్క వెలుగు మరియు జ్ఞానమునకు వ్యతిరేకముగా హత్య చేయువాడు క్షమాపణ పొందుట సులభము కాదు; నా కుమారుడా, క్షమాపణ పొందుట అతనికి అంత సులభము కాదని నేను నీతో చెప్పుచున్నాను.
7 ఇప్పుడు, నా కుమారుడా, అంత గొప్ప నేరము నిమిత్తము నీవు దోషియై యుండరాదని నేను దేవుడిని అర్థించుచున్నాను. నీ మేలు కొరకు కాని యెడల, నీ ఆత్మను వేధించుటకు నీ నేరములను గూర్చి నేను మాట్లాడను.
8 కానీ నీ నేరములను దేవుని నుండి నీవు దాచలేవు; నీవు పశ్చాత్తాపపడని యెడల, అంత్యదినమున అవి నీకు వ్యతిరేకముగా ఒక సాక్ష్యముగా నిలుచును.
9 నా కుమారుడా, నీవు పశ్చాత్తాపపడి నీ పాపములను విడిచిపెట్టవలెనని, నీ కన్నుల యొక్క కామేచ్ఛల వెనుక ఇక వెళ్ళరాదని, ఈ విషయములన్నిటిని మానివేయవలెనని నేను కోరుచున్నాను; ఏలయనగా దీనిని జరిగించితే తప్ప, నీవు దేవుని రాజ్యమును ఏ విధముగాను స్వతంత్రించుకొనలేవు. ఓ జ్ఞాపకముంచుకొనుము, దీనిని చేయుము మరియు ఈ విషయములను మానివేయుము.
10 నీ ప్రయత్నములలో నీ అన్నలతో ఆలోచన చేయుటకు తీర్మానించుకోమని నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను; ఏలయనగా నీవు నీ యౌవనమందున్నావు మరియు నీ సహోదరుల చేత పోషించబడవలసియున్నావు. కావున వారి సలహాకు చెవియొగ్గుము.
11 వ్యర్థమైన లేదా మూర్ఖపు విషయము చేత నడిపించి వేయబడుటకు నిన్ను అనుమతించుకొనవద్దు; దుష్టులైన ఆ వేశ్యల వెనుక నీ హృదయమును తిరిగి నడిపించివేయుటకు అపవాదిని అనుమతించవద్దు. నా కుమారుడా, జోరమీయులపై నీవు ఎంత గొప్ప దుర్నీతిని తెచ్చియున్నావో చూడుము; వారు నీ నడవడిని చూచినప్పుడు, నా మాటలయందు విశ్వసించలేదు.
12 ఇప్పుడు ప్రభువు యొక్క ఆత్మ నాతో ఇట్లు చెప్పెను: మేలు చేయుటకు నీ సంతానమునకు ఆజ్ఞ ఇమ్ము, లేని యెడల వారు అనేకుల హృదయములను నాశనమునకు నడిపించివేయుదురు; కావున నా కుమారుడా, నీ దోషములను మానివేయమని;
13 నీ పూర్ణ మనస్సు, బలము మరియు శక్తితో ప్రభువు వైపుకు తిరుగమని; దుర్మార్గము జరిగించుటకు ఇక నీవు ఎవరి హృదయములను నడిపించివేయరాదని; బదులుగా వారి యొద్దకు తిరిగివెళ్ళి నీ పొరపాట్లను మరియు నీవు చేసిన ఆ తప్పును ఒప్పుకొనమని దేవుని భయమందు నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను.
14 సంపదలను లేదా ఈ లోకము యొక్క వ్యర్ధమైన విషయములను కోరకుము; ఏలయనగా నీవు వాటిని నీతో తీసుకొనిపోలేవు.
15 ఇప్పుడు, నా కుమారుడా, క్రీస్తు యొక్క రాకడను గూర్చి నేను నీకు కొంత చెప్పెదను. లోకము యొక్క పాపములను తీసివేయుటకు నిశ్చయముగా రాబోవు వ్యక్తి ఆయనేనని నేను నీతో చెప్పుచున్నాను; తన జనులకు రక్షణ యొక్క సువర్తమానములను ప్రకటించుటకు ఆయన వచ్చును.
16 నా కుమారుడా, ఈ సువర్తమానములను ఈ జనులకు ప్రకటించుటకు, వారి మనస్సులను సిద్ధపరచుటకు లేదా మరొక మాటలో, రక్షణ వారి యొద్దకు వచ్చునట్లు ఆయన రాకడ సమయమున వాక్యమును వినుటకు వారు తమ సంతానము యొక్క మనస్సులను సిద్ధపరచునట్లు చేయుటకే నీవు పిలువబడినది.
17 ఇప్పుడు ఈ విషయముపై నీ మనస్సుకు కొంత ఊరటనిచ్చెదను. ఇంత ముందుగా ఈ క్రియలు ఎందుకు తెలియజేయబడవలెనని నీవు ఆశ్చర్యపడుచుండవచ్చు. నేను నీతో చెప్పుచున్నాను, ఒక ఆత్మ ఆయన రాకడ సమయమున ఎంత విలువైనదో, అదేవిధముగా ఈ సమయమున ఒక ఆత్మ దేవునికి విలువైనది కాదా?
18 వారి సంతానముతో పాటు, ఈ జనులకు కూడా విమోచన ప్రణాళిక తెలియజేయబడుట అవసరము కాదా?
19 ఆయన రాకడ తర్వాత మన సంతానమునకు తెలియజేసినట్లు, ఈ సమయమున మనకు ఈ సువర్తమానములను తెలియజేయుటకు తన దేవదూతను పంపుట ప్రభువుకు సులభము కాదా?