లేఖనములు
ఆల్మా 47


47వ అధ్యాయము

లేమనీయుల యొక్క రాజగుటకు అమలిక్యా వంచన, హత్య మరియు కుట్రను ఉపయోగించును—నీఫైయుల అసమ్మతీయులు లేమనీయుల కంటే అధిక దుర్మార్గులు మరియు భీకరమైన వారు. సుమారు క్రీ. పూ. 72 సం.

1 ఇప్పుడు మనము మన గ్రంథమందు అమలిక్యా మరియు అతనితో అరణ్యములోనికి పారిపోయిన వారి వద్దకు తిరిగి వెళ్ళెదము; ఏలయనగా అతడు, అతని వెంట వచ్చువారిని తీసుకొని నీఫై దేశమందు లేమనీయుల మధ్యకు వెళ్ళి వారిని నీఫై యొక్క జనులకు వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పెను, ఎంతగాననగా నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తిరిగి సమకూడవలెనని లేమనీయుల రాజు అతని దేశమంతటా తన జనులందరి మధ్య ఒక చాటింపు వేయించెను.

2 ఆ చాటింపు వారి మధ్య వినబడినప్పుడు, వారు మిక్కిలి భయపడిరి; వారు రాజును నొప్పించుటకు భయపడిరి మరియు వారి ప్రాణములను పోగొట్టుకొందురేమోనని నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు కూడా వారు భయపడిరి. రాజు యొక్క ఆజ్ఞలకు లోబడుటకు వారు ఇష్టపడలేదు లేదా వారిలో అధికభాగము ఇష్టపడలేదు.

3 వారి అవిధేయతను బట్టి రాజు చాలా కోపముగా నుండెను; కావున అతడు, తన ఆజ్ఞలకు లోబడిన తన సైన్యములో ఒక భాగముపై సైన్యాధిపత్యమును అమలిక్యాకు ఇచ్చెను మరియు అతడు వెళ్ళి, వారిని యుద్ధమునకు బలవంతము చేయవలెనని ఆజ్ఞాపించెను.

4 ఇప్పుడు అమలిక్యా యొక్క కోరిక ఇదియే; ఏలయనగా అతడు కీడు చేయుటకు మిక్కిలి కుయుక్తి గలవాడైయుండి, లేమనీయుల రాజును సింహాసనం నుండి తొలగించుటకు తన హృదయమందు ప్రణాళిక రచించెను.

5 రాజు యెడల అనుగ్రహమున్న లేమనీయుల యొక్క ఆ భాగములపై అతడు సైన్యాధిపత్యమును పొందెను; మరియు అవిధేయుల అనుగ్రహమును సంపాదించుటకు అతడు కోరెను; కావున లేమనీయులందరు పారిపోయిన ఒనీడా అని పిలువబడిన స్థలమునకు అతడు వెళ్ళెను; ఏలయనగా సైన్యము వచ్చుటను చూచి, తమను నాశనము చేయుటకు వచ్చుచున్నారని తలంచి, వారు ఆయుధాగారమైన ఒనీడాకు పారిపోయిరి.

6 నీఫైయులకు వ్యతిరేకముగా వెళ్ళుటకు వారు బలవంతము చేయబడరాదని వారి మనస్సులయందు దృఢముగా నిర్ణయించుకొని, వారిపై రాజుగా, నాయకుడుగా ఉండుటకు ఒక మనుష్యుని వారు నియమించియుండిరి.

7 మరియు వారు ఆంటిపస్ అని పిలువబడిన కొండ శిఖరముపై సమకూడి, యుద్ధమునకు సన్నద్ధులైరి.

8 ఇప్పుడు రాజు యొక్క ఆజ్ఞలను బట్టి వారితో యుద్ధము చేయుట అమలిక్యా యొక్క ఉద్దేశ్యము కాదు; కానీ, వారిపై అధికారము పొందగలుగునట్లు, రాజును సింహాసనమునుండి తొలగించి, రాజ్యమును స్వాధీనము చేసుకొనునట్లు లేమనీయుల సైన్యముల అనుగ్రహము సంపాదించుట అతని ఉద్దేశ్యమైయుండెను.

9 మరియు ఆంటిపస్ కొండ దగ్గరున్న లోయయందు తన సైన్యము గుడారములు వేసుకొనునట్లు అతడు చేసెను.

10 రాత్రి అయినప్పుడు అతడు అతనితో మాట్లాడగోరుచున్నాడని చెప్పి, కొండ మీదనున్న వారి నాయకుడైన లెహోంటి అను పేరుగల వానిని కొండ క్రిందికి దిగి రావలెనని కోరుచూ ఆంటిపస్ కొండ మీదకు అతడు ఒక రహస్య రాయబారము పంపెను.

11 ఆ సందేశమును అందుకొన్నప్పుడు లెహోంటి కొండ క్రిందకు వెళ్ళుటకు ధైర్యము చేయలేదు. క్రిందకు రావలెనని అతడిని కోరుచూ అమలిక్యా రెండవసారి సందేశము పంపెను, కానీ లెహోంటి రాలేదు. అతడు తిరిగి మూడవసారి పంపెను.

12 లెహోంటి కొండ నుండి క్రిందికి వచ్చునట్లు చేయలేకపోయెనని అమలిక్యా కనుగొన్నప్పుడు, అతడు కొండ ఎక్కి దాదాపు లెహోంటి శిబిరము వరకు వెళ్ళెను; మరియు అతడు క్రిందికి రావలెనని, తన భటులను తనతో తెచ్చుకోవచ్చునని చెప్పుచూ అతడు తిరిగి నాలుగవసారి లెహోంటికి తన సందేశమును పంపెను.

13 లెహోంటి తన భటులతో అమలిక్యా యొద్దకు దిగివచ్చినపుడు, రాత్రి సమయమందు లెహోంటి తన సైన్యముతో దిగివచ్చి, రాజు అతనికి సైన్యాధిపత్యము ఇచ్చిన ఆ మనుష్యులను వారి శిబిరములలో ముట్టడించమని అమలిక్యా కోరెను మరియు అతడిని (అమలిక్యాను) సమస్త సైన్యముపై రెండవ నాయకునిగా చేసిన యెడల అతడు వారిని లెహోంటి చేతులకు అప్పగించునని చెప్పెను.

14 లెహోంటి తన మనుష్యులతో దిగి వచ్చి అమలిక్యా మనుష్యులను చుట్టుముట్టినందున, ప్రాతఃకాలమున వారు మేల్కొనక ముందే వారు లెహోంటి సైన్యముల చేత ముట్టడించబడిరి.

15 వారు ముట్టడించబడియున్నారని చూచినపుడు, వారు నాశనము చేయబడకుండునట్లు వారి సహోదరులతో కలియుటకు అతడు వారిని అనుమతించవలెనని వారు అమలిక్యాను బ్రతిమాలిరి. ఇప్పుడు అమలిక్యా కోరినది ఇదియే.

16 మరియు రాజు యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా అతడు తన మనుష్యులను అప్పగించెను. రాజును సింహాసనము నుండి తొలగించుటలో తన ప్రణాళికలను అతడు సాధించగలుగునట్లు అమలిక్యా కోరుకున్నది ఇదియే.

17 ఇప్పుడు వారి ముఖ్యనాయకుడు చంపబడిన యెడల, రెండవ నాయకుడిని వారి ముఖ్యనాయకునిగా నియమించుట అనునది లేమనీయుల మధ్య ఒక ఆచారమైయుండెను.

18 మరియు లెహోంటి మరణించునట్లు అతని సేవకులలో ఒకడు అతనికి కొంచెము కొంచెముగా విషము ఇచ్చునట్లు అమలిక్యా చేసెను.

19 ఇప్పుడు లెహోంటి చనిపోయినప్పుడు, లేమనీయులు అమలిక్యాను వారి నాయకునిగా మరియు వారి ముఖ్య సైన్యాధ్యక్షునిగా నియమించిరి.

20 అమలిక్యా అతని సైన్యములతో (ఏలయనగా అతడు తన కోరికలను సాధించుకొని యున్నందున) నీఫై దేశమునకు, ముఖ్య పట్టణమైన నీఫై పట్టణమునకు నడిచెను.

21 మరియు రాజు అతడిని కలుసుకొనుటకు తన భటులతో బయటకు వచ్చెను, ఏలయనగా అమలిక్యా అతని ఆజ్ఞలను నెరవేర్చెనని, నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు గొప్ప సైన్యమును సమకూర్చెనని అతడు తలంచెను.

22 కానీ రాజు అతడిని కలుసుకొనుటకు బయటకు రాగా, రాజును కలుసుకొనుటకు తన సేవకులు ముందుకు వెళ్ళునట్లు అమలిక్యా చేసెను. అతని గొప్పతనమును బట్టి అతడిని గౌరవించుచున్నట్లుగా వారు రాజు యెదుట వంగి నమస్కరించిరి.

23 మరియు లేమనీయుల ఆచారమును బట్టి రాజు సమాధానమునకు గుర్తుగా వారిని పైకి లేపుటకు తన చేతిని ముందుకు చాపెను, ఈ ఆచారమును వారు నీఫైయుల నుండి పొందిరి.

24 అతడు మొదటి వానిని పైకి లేపినప్పుడు, అతడు రాజును హృదయమందు పొడిచెను; మరియు అతడు నేలపై పడెను.

25 ఇప్పుడు రాజు యొక్క సేవకులు పారిపోయిరి మరియు అమలిక్యా యొక్క సేవకులు కేకలు వేయుట మొదలుపెట్టి ఇట్లు చెప్పిరి:

26 ఇదిగో రాజు యొక్క సేవకులు అతడిని హృదయమందు పొడిచిరి మరియు అతడు పడిపోగా వారు పారిపోయిరి; ఇదిగో రండి, చూడుడి.

27 ఇప్పుడు అతని సైన్యములు ముందుకు వెళ్ళి, రాజుకు ఏమి జరిగెనో చూడవలెనని అమలిక్యా ఆజ్ఞాపించెను; వారు ఆ స్థలమునకు వచ్చి రాజు రక్తపుమడుగులో పడియుండుట చూచినప్పుడు, అమలిక్యా కోపముతోనున్నట్లు నటించి ఇట్లనెను: రాజును ప్రేమించిన వాడెవడైనను వెళ్ళి, అతని సేవకులు సంహరింపబడునట్లు వారిని తరుమవలెను.

28 మరియు రాజును ప్రేమించిన వారు ఈ మాటలను వినినప్పుడు, రాజు యొక్క సేవకుల వెంటపడి వారిని తరిమిరి.

29 ఇప్పుడు ఒక సైన్యము వారిని తరుముటను రాజు యొక్క సేవకులు చూచినప్పుడు, వారు మరలా భయపడి అరణ్యములోనికి పారిపోయి జరహేమ్ల దేశములోనికి వచ్చి అమ్మోన్ యొక్క జనులతో చేరిరి.

30 వారిని తరిమిన సైన్యము, వారి వెనుక వ్యర్థముగా తరిమియుండి తిరిగి వచ్చెను; ఆ విధముగా అమలిక్యా మోసము చేత జనుల హృదయములను గెలుచుకొనెను.

31 ఉదయమున అతడు తన సైన్యములతో నీఫై యొక్క పట్టణమునందు ప్రవేశించి, ఆ పట్టణమును స్వాధీనము చేసుకొనెను.

32 మరియు రాజు సంహరింపబడెనని రాణి వినినప్పుడు—ఏలయనగా రాజు అతని సేవకుల చేత సంహరింపబడెనని, అతడు తన సైన్యముతో వారిని తరిమెనని, కానీ అది వ్యర్థమైనదని, వారు తప్పించుకొని పోయిరని అమలిక్యా రాణికి ఒక రాయబారమును పంపియుండెను—

33 కావున రాణి ఈ సందేశమును అందుకొనినప్పుడు, అతడు పట్టణము యొక్క జనులను సంరక్షించవలెనని కోరుచూ ఆమె అమలిక్యా యొద్దకు సమాచారము పంపెను; ఆమె యొద్దకు రావలెనని మరియు రాజు యొక్క మరణమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షులను కూడా అతనితో తీసుకురావలెనని ఆమె అతడిని కోరెను.

34 అప్పుడు అమలిక్యా రాజును సంహరించిన అదే సేవకుడిని, అతనితోనుండిన వారందరినీ తీసుకొని రాణి యొద్దకు ఆమె కూర్చున్న స్థలమునకు వెళ్ళెను; అతని స్వంత సేవకుల చేత రాజు సంహరింపబడెనని వారందరు ఆమెకు సాక్ష్యమిచ్చిరి; మరియు వారు పారిపోయిరి, వారికి వ్యతిరేకముగా ఇది సాక్ష్యమిచ్చుటలేదా? అని కూడా వారు చెప్పిరి. ఆ విధముగా వారు రాజు యొక్క మరణమును గూర్చి రాణిని సమాధానపరచిరి.

35 అమలిక్యా రాణి యొక్క అనుగ్రహమును కోరి, ఆమెను భార్యగా చేసుకొనెను; ఆ విధముగా అతని మోసము ద్వారా, అతని కపట సేవకుల యొక్క సహాయము ద్వారా అతడు రాజ్యమును సంపాదించెను; ముఖ్యముగా దేశమంతటా లేమనీయులు, లెమూయేలీయులు, ఇష్మాయేలీయులు మరియు నీఫై యొక్క పరిపాలన నుండి ఇప్పటి వరకు గల నీఫైయుల అసమ్మతీయులందరు కలిసియున్న లేమనీయుల జనులందరి మధ్య అతడు రాజుగా గుర్తింపబడెను.

36 ఇప్పుడు ఈ అసమ్మతీయులు, నీఫైయుల యొక్క అదే ఉపదేశమును అదే సమాచారమును కలిగియుండిరి, ప్రభువు యొక్క అదే జ్ఞానమందు ఉపదేశింపబడియుండిరి, అయినప్పటికీ అది వివరించుటకు వింతగా ఉండును, వారు విడిపోయిన తర్వాత ఎక్కువ కాలము గడవకముందే, వారు లేమనీయుల పారంపర్యాచారములందు పానము చేయుచూ సోమరితనము మరియు సమస్త విధమైన కాముకత్వమునకు దారి ఇచ్చుచూ ప్రభువైన వారి దేవుడిని పూర్తిగా మరచిపోవుచూ లేమనీయుల కంటే కఠినాత్ములై పశ్చాత్తాపపడక అధిక కౄరులుగా, దుర్మార్గులుగా మరియు భీకరులుగా మారిరి.