అమ్మోనైహా దేశమందున్న జనులకు ప్రకటించబడిన ఆల్మా యొక్క మాటలు మరియు అమ్యులెక్ యొక్క మాటలు. ఆల్మా యొక్క గ్రంథము ప్రకారము, వారు చెరసాలలో వేయబడిరి మరియు వారియందున్న దేవుని యొక్క అద్భుత శక్తి ద్వారా విడిపించబడిరి.
9 నుండి 14 అధ్యాయములు కలిగియున్నవి.
9వ అధ్యాయము
అమ్మోనైహా జనులను పశ్చాత్తాపపడమని ఆల్మా ఆజ్ఞాపించును—అంత్యదినములందు ప్రభువు లేమనీయుల పట్ల కనికరము చూపును—నీఫైయులు వెలుగును త్యజించిన యెడల, వారు లేమనీయుల చేత నాశనము చేయబడుదురు—దేవుని కుమారుడు త్వరగా వచ్చును—పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొంది, ఆయన నామమందు విశ్వసించు వారిని ఆయన విమోచించును. సుమారు క్రీ. పూ. 82 సం.
1 మరలా ఆల్మా అను నేను, అమ్యులెక్ను తీసుకొనివెళ్ళి ఈ జనులకు లేదా అమ్మోనైహా పట్టణమందున్న జనులకు తిరిగి బోధించవలెనని దేవుని చేత ఆజ్ఞాపించబడియుండి వారికి బోధించుట ప్రారంభించగా, వారు నాతో వాదించుట మొదలుపెట్టి ఇట్లనిరి:
2 నీవెవరు? భూమి గతించిపోవలెనని అతడు మాకు బోధించినప్పటికీ మేము ఒక మనుష్యుని సాక్ష్యమును నమ్ముదుమని నీవనుకొనుచున్నావా?
3 ఇప్పుడు, వారు పలికియున్న మాటలను వారు గ్రహించలేదు; ఏలయనగా భూమి గతించునని వారు ఎరిగియుండలేదు.
4 వారింకను ఇట్లు చెప్పిరి: ఈ గొప్ప పట్టణము ఒక్క దినమందే నాశనమగునని నీవు ప్రవచించినను మేము నీ మాటలను నమ్మము.
5 ఇప్పుడు దేవుడు అట్టి అద్భుతకార్యములను చేయగలడని వారు ఎరిగియుండలేదు, ఏలయనగా వారు కఠిన హృదయులు, మెడబిరుసు జనులైయుండిరి.
6 మరియు వారు ఇట్లనిరి: ఈ జనులకు అట్టి గొప్ప ఆశ్చర్యకరమైన విషయముల యథార్థతను ప్రకటించుటకు వారి మధ్య ఒక్క మనుష్యుని కంటే ఎక్కువ అధికారులను పంపని దేవుడెవరు?
7 ఇప్పుడు వారు నన్ను పట్టుకొనుటకు ముందుకు వచ్చిరి; కానీ, పట్టుకొనలేదు. నేను వారికి ప్రకటించుటకు ధైర్యముతో నిలబడితిని, అనగా వారికి ఇట్లు చెప్పుచూ నేను ధైర్యముగా సాక్ష్యమిచ్చితిని:
8 ఓ, దుష్టులైన మూర్ఖతరము వారలారా, మీ పితరుల ఆచారమును మీరెట్లు మరచిపోతిరి; ఎంత త్వరగా మీరు దేవుని ఆజ్ఞలను మరచిపోతిరి.
9 మన పితరుడైన లీహై దేవుని హస్తము ద్వారా యెరూషలేము నుండి బయటకు తీసుకొనిరాబడెనని మీకు జ్ఞాపకము లేదా? వారందరు అరణ్యమందు ఆయన ద్వారా నడిపించబడిరని మీకు జ్ఞాపకము లేదా?
10 అనేకమార్లు ఆయన మన పితరులను వారి శత్రువుల చేతులలో నుండి విడిపించెనని, వారి స్వంత సహోదరుల చేతులలో నాశనము కాకుండా వారిని కాపాడెనని మీరు ఇంత త్వరగా మరిచిపోతిరా?
11 ఆయన మన పట్ల తన సాటిలేని శక్తిని, కనికరమును, దీర్ఘశాంతమును చూపని యెడల మనము ఈ సమయమునకు ఎంతోకాలము ముందుగానే భూముఖము నుండి తప్పనిసరిగా కొట్టివేయబడి ఉండేవారము, బహుశా ఒక అంతము లేని దౌర్భాగ్యమునకు దుఃఖమునకు అప్పగించబడి ఉండేవారము.
12 పశ్చాత్తాపపడవలెనని ఆయన మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాడని ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను; మీరు పశ్చాత్తాపపడని యెడల మీరేవిధముగాను దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. కానీ, అంతయు ఇదియే కాదు—పశ్చాత్తాపపడమని ఆయన మిమ్ములను ఆజ్ఞాపించియున్నాడు, లేని యెడల ఆయన మిమ్ములను భూముఖము పైనుండి పూర్తిగా నాశనము చేయును; ఆయన తన కోపమందు మిమ్ములను దర్శించును మరియు తన తీవ్రమైన కోపము నుండి ఆయన మరలిపోడు.
13 ఇదిగో, మీరు నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము మీరు దేశమందు వర్ధిల్లుదురని చెప్పుచూ ఆయన లీహైతో పలికిన మాటలు మీకు జ్ఞాపకము లేవా? మరియు మీరు నా ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము ప్రభువు యొక్క సన్నిధి నుండి మీరు కొట్టివేయబడుదురని కూడా చెప్పబడెను.
14 ఇప్పుడు లేమనీయులు దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము వారు ప్రభువు యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడియున్నారని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను. ఈ విషయములో ప్రభువు యొక్క వాక్యము ఋజువైనదని మనము ఇప్పుడు చూచుచున్నాము. దేశమందు వారి అతిక్రమముల ఆరంభము నుండి లేమనీయులు ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడియున్నారు.
15 అయినప్పటికీ నేను మీతో చెప్పుచున్నాను, మీరు మీ పాపములలో నిలిచియున్న యెడల తీర్పు దినమున మీ గతి కంటె వారి గతి సహింపదగినదైయుండును. మీరు పశ్చాత్తాపపడని యెడల ఈ జీవితమందు మీ గతి కంటే వారి గతి ఎక్కువ సహింపదగినదైయుండును.
16 ఏలయనగా లేమనీయులకు అనేక వాగ్దానములు ఇవ్వబడినవి; వారి పితరుల ఆచారముల కారణముగా వారు తమ అజ్ఞానపు స్థితి యందు నిలిచియుండిరి; కావున ప్రభువు వారి పట్ల కనికరము చూపి, దేశమందు వారి ఉనికిని పొడిగించును.
17 ఏదో ఒకనాడు ఆయన వాక్యమందు విశ్వసించి, వారి పితరుల తప్పుడు ఆచారములను వారు తెలుసుకొనునట్లు చేయబడుదురు మరియు వారిలో అనేకులు రక్షింపబడుదురు; ఏలయనగా ఆయన నామమున ప్రార్థించు వారందరికి ప్రభువు కనికరము చూపును.
18 కానీ ఇదిగో, నేను మీతో చెప్పుచున్నాను, మీరు మీ దుష్టత్వమందు కొనసాగిన యెడల దేశమందు మీ దినములు పొడిగించబడవు, ఏలయనగా లేమనీయులు మీ పైకి పంపబడుదురు; మీరు పశ్చాత్తాపపడని యెడల, మీరు ఎరుగని సమయమందు వారు వచ్చెదరు మరియు మీరు పూర్తి నాశనముతో దర్శింపబడుదురు; అది ప్రభువు యొక్క తీవ్రమైన కోపమును బట్టియైయుండును.
19 ఏలయనగా ఆయన జనులను నాశనము చేయునట్లు మీరు మీ దోషముల యందు జీవించుటకు ఆయన మిమ్ములను అనుమతించడని నేను మీతో చెప్పుచున్నాను; అధిక వెలుగును కలిగియుండి, తమ దేవుడైన ప్రభువు చేత అధిక జ్ఞానము ఇవ్వబడిన తరువాత వారు పాపములలో, అతిక్రమములలో పడుట సాధ్యమైతే, నీఫై జనులని పిలువబడిన ఆ జనులందరినీ లేమనీయులు నాశనము చేయునట్లు ఆయన అనుమతించును.
20 ప్రభువు చేత అంత అధిక అనుగ్రహము పొందిన జనులైయుండి; ప్రతి జనము, వంశము, భాష, లేదా ప్రజల కంటే అధిక అనుగ్రహము పొంది; వారి కోరికలు, విశ్వాసము మరియు ప్రార్థనలను బట్టి భూత భవిష్యత్ వర్తమానకాల విషయములు వారికి తెలియజేయబడిన తరువాత;
21 దేవుని ఆత్మ చేత దర్శించబడి; దేవదూతలతో మాట్లాడి, ప్రభువు యొక్క స్వరమును ఆలకించి; ప్రవచనాత్మను, బయల్పాటు ఆత్మను, ఇంకను అనేక బహుమానములు అనగా భాషలతో మాట్లాడు బహుమానము, బోధించు బహుమానము, పరిశుద్ధాత్మ వరము మరియు అనువాద బహుమానములను కలిగియుండిన తరువాత;
22 ప్రభువు యొక్క హస్తము ద్వారా దేవుని చేత యెరూషలేము దేశము నుండి విడిపించబడి; కరువు, రోగము మరియు సమస్త విధములైన వ్యాధుల నుండి కాపాడబడి; వారు నాశనము చేయబడకుండునట్లు యుద్ధమందు బలవంతులుగా వృద్ధిచెంది; పలుమార్లు దాస్యము నుండి బయటకు తేబడి ఇప్పటి వరకు భద్రపరచబడి, కాపాడబడియుండి; సకల విధములైన వస్తువుల యందు వారు ఐశ్వర్యవంతులగు వరకు వర్థిల్లజేయబడిన తరువాత—
23 ఇప్పుడు, ప్రభువు యొక్క హస్తము నుండి ఎంతో ఎక్కువ ఆశీర్వాదములు పొందిన ఈ జనులు వారు కలిగియున్న వెలుగు మరియు జ్ఞానమునకు వ్యతిరేకముగా అతిక్రమము చేసిన యెడల, నేను మీతో చెప్పుచున్నాను, ఒకవేళ వారు అతిక్రమములో పడిన యెడల, వారి గతి కంటే లేమనీయులు గతి ఎక్కువ సహింపదగినదైయుండును.
24 ఏలయనగా ప్రభువు యొక్క వాగ్దానములు లేమనీయులకు ఇవ్వబడినవి, కానీ మీరు అతిక్రమము చేసిన యెడల, అవి మీకు వర్తించవు; మీరు ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన యెడల, మీరు భూముఖము పైనుండి పూర్తిగా నాశనము చేయబడుదురని ప్రభువు స్పష్టముగా వాగ్దానము చేసి, ఖచ్చితముగా నిర్ణయించియుండలేదా?
25 ఇప్పుడు మీరు నాశనము కారాదను హేతువు నిమిత్తము, వారు వెళ్ళి—మీరు పశ్చాత్తాపపడుడి, ఏలయనగా పరలోకరాజ్యము సమీపించియున్నదని చెప్పుచూ ఈ జనులకు బిగ్గరగా కేకవేసి చెప్పవలెనని వారికి ప్రకటించుచూ తన జనులలో అనేకులను దర్శించుటకు ప్రభువు తన దేవదూతను పంపెను;
26 ఇప్పటి నుండి కొద్దికాలమునకు దేవుని కుమారుడు తన మహిమలో వచ్చును; ఆయన మహిమ తండ్రి యొక్క అద్వితీయునిగా పుట్టిన వాని మహిమవలెనుండును, ఆయన కృపాసత్య సంపూర్ణుడై, న్యాయము, సహనము, కనికరము, దీర్ఘశాంతముతో నిండియుండి తన జనుల మొరలను వినుటకు, వారి ప్రార్థనలకు జవాబిచ్చుటకు వేగముగా ఉండును.
27 ఆయన నామమందు విశ్వాసము ద్వారా పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొందువారిని విమోచించుటకు ఆయన వచ్చును.
28 కావున ప్రభువు మార్గమును మీరు సిద్ధపరచుడి, ఏలయనగా వారు చేసిన దానిని బట్టి, మనుష్యులందరు వారి క్రియల యొక్క ప్రతిఫలమును పొందు సమయము సమీపించియున్నది—వారు నీతిమంతులైన యెడల యేసు క్రీస్తు యొక్క శక్తి మరియు విడుదలను బట్టి, వారి ఆత్మల యొక్క రక్షణను వారు పొందెదరు; వారు దుష్టులైన యెడల అపవాది యొక్క శక్తి మరియు చెరను బట్టి, వారి ఆత్మల యొక్క నాశనమును వారు పొందెదరు.
29 ఇప్పుడు జనులకు బిగ్గరగా ప్రకటించు దేవదూత స్వరము ఇదియే.
30 నా ప్రియమైన సహోదరులారా, ఏలయనగా మీరు నా సహోదరులు, మీరు ప్రియులైయుండవలెను మరియు మీ హృదయములు దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా పూర్తిగా కఠినపరచబడినవని చూచి, మీరు తప్పిపోయిన మరియు దిగజారిన జనులని చూచి పశ్చాత్తాపమునకు తగిన క్రియలను మీరు జరిగించవలెను.
31 ఇప్పుడు, ఆల్మా అను నేను ఈ మాటలను పలికినప్పుడు జనులు నాతో కోపముగా నుండిరి, ఏలయనగా వారు కఠిన హృదయులని, మెడబిరుసు జనులని నేను వారితో చెప్పితిని.
32 వారు తప్పిపోయిన మరియు దిగజారిన జనులని వారితో చెప్పినందుకు కూడా వారు నాతో కోపముగా నుండి, చెరసాలలో వేయునట్లు నన్ను పట్టుకొనుటకు ప్రయత్నించిరి.
33 కానీ, ఆ సమయమున వారు నన్ను పట్టుకొని చెరసాలలో వేయుటకు ప్రభువు వారిని అనుమతించ లేదు.
34 ఇప్పుడు అమ్యులెక్ వెళ్ళి వారి ముందు నిలిచి, వారికి బోధించుట ప్రారంభించెను. అమ్యులెక్ యొక్క మాటలన్నియు వ్రాయబడలేదు, అయినప్పటికీ అతని మాటలలో కొంతభాగము ఈ గ్రంథమందు వ్రాయబడెను.