“యోసేపు మరియు కరువు,” పాత నిబంధన కథలు (2022)
“యోసేపు మరియు కరువు,” పాత నిబంధన కథలు
యోసేపు మరియు కరువు
తన కుటుంబాన్ని ఏకం చేయడానికి ఒక సహోదరునికి గల అవకాశం
కరువు కారణంగా యాకోబు కుటుంబము ఆకలితోనున్నారు. కాబట్టి ఆహారం కొనడానికి యాకోబు తన కొడుకులను ఐగుప్తుకు పంపాడు. అతడు తన చిన్న కొడుకు బెన్యామీనును ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు. చాలా సంవత్సరాల క్రితం తన కొడుకు యోసేపును కోల్పోయినట్లే బెన్యామీనును కూడా కోల్పోతాడేమోనని అతడు భయపడ్డాడు. అతని పెద్ద కొడుకులు యోసేపును బానిసగా అమ్మివేసారని అతనికి తెలియదు.
ఆ సమయానికి యోసేపు ఐగుప్తులో ఒక గొప్ప నాయకుడు. కరువు సమయంలో ఆహారం అమ్మకంపై అతడు అధికారి. సహోదరులు యోసేపును కలిసి, ఆహారం కావాలని అతడిని అడిగారు. వారు అతడిని గుర్తుపట్టలేదు.
యోసేపు వారిని గుర్తుపట్టాడు, కానీ వారెవరో తెలియనట్లు నటించాడు. అతని తండ్రి మరియు తమ్ముడు బెన్యామీను బ్రతికే ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళ కుటుంబం గురించి అతను అడిగాడు.
అప్పుడు యోసేపు తన అన్నలకు ఆహారం ఇచ్చాడు. వారితోపాటు వారి చిన్న తమ్ముడు బెన్యామీనును తీసుకువస్తే తప్ప, మళ్ళీ ఆహారం కోసం తిరిగి రావద్దని అతడు వారితో చెప్పాడు.
కుటుంబం దగ్గర ఆహారం ఖాళీ అయినప్పుడు, బెన్యామీనును మిగతా కొడుకులతో పాటు తిరిగి ఐగుప్తుకు పంపాలని యాకోబుకు తెలుసు. బెన్యామీనును పంపడానికి యాకోబు ఇంకా భయపడుతున్నాడు. కానీ, సహోదరులలో ఒకడైన యూదా, బెన్యామీనును సురక్షితంగా ఉంచుతానని వాగ్దానం చేసాడు.
సహోదరులు ఐగుప్తుకు తిరిగివచ్చినప్పుడు, బెన్యామీను వెండి గిన్నెను దొంగిలించినట్లు కనిపించేలా యోసేపు చేసాడు. అతని అన్నలు మారారో లేదో అతను తెలుసుకోవాలనుకున్నాడు. బెన్యామీనును శిక్షించవద్దని, బదులుగా నన్ను శిక్షించండి అని యూదా యోసేపును వేడుకున్నాడు.
అతడి అన్నలు మారడం చూసి యోసేపు చాలా సంతోషించాడు. వారు బెన్యామీనును రక్షించాలనుకొనేంతగా అతడిని ప్రేమించారు. కాబట్టి, చివరికి అతనెవరో యోసేపు వారికి చెప్పాడు.
తనను బానిసగా అమ్మివేసినందుకు తన అన్నలను యోసేపు క్షమించాడు. తమ కుటుంబము కరువు నుండి కాపాడబడేందుకు అది ప్రభువు సహాయం చేసిన విధానమని యోసేపు అన్నాడు.
యోసేపు అన్నలు వారి తండ్రి యాకోబు దగ్గరకు వెళ్ళి, అతనికి జరిగినదంతా చెప్పారు. యాకోబు తన కుటుంబమంతటిని ఐగుప్తుకు తరలించాడు.
యాకోబు కుటుంబాన్ని ఫరో ఆహ్వానించాడు. వారు అధిక మొత్తంలో ఆహారం కలిగియుండేలా అతడు వారికి భూమిని, పశువులను ఇచ్చాడు. చాలాకాలం పాటు యాకోబు కుటుంబం ప్రశాంతంగా జీవించింది.