“ప్రవక్తయైన యెహోషువ,” పాత నిబంధన కథలు (2022)
“ప్రవక్తయైన యెహోషువ,” పాత నిబంధన కథలు
ద్వితీయోపదేశకాండము 10; 31; 34; యెహోషువ 1; 3–6; 10–11; 21; 24
ప్రవక్తయైన యెహోషువ
వాగ్దానదేశములో ప్రవేశించడానికి ముందు చివరి పరీక్ష
ప్రవక్తయైన మోషే పరలోకానికి తీసుకుపోబడిన తర్వాత ప్రభువు క్రొత్త ప్రవక్తగా యెహోషువను పిలిచారు. ఇశ్రాయేలీయులు యొర్దాను నది దగ్గర బస చేసినప్పుడు, వారు వాగ్దానదేశానికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైనదని ప్రభువు చెప్పారు.
ద్వితీయోపదేశకాండము 34:1–9; యెహోషువ 1:1–4; ఆల్మా 45:19
వాగ్దానదేశము కనానులో ఉంది, కానీ అక్కడ దుష్టులు నివసించారు. బలంగా, ధైర్యంగా ఉండమని ప్రభువు యెహోషువతో చెప్పారు. ప్రభువు సహాయంతో ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని జయించగలిగారు.
యెహోషువ ఒక సైన్యమును సమకూర్చాడు. పది ఆజ్ఞలు ఉన్న రాతిఫలకాలను, ఇతర లేఖనాలను తీసుకువెళ్ళమని ప్రభువు వారికి చెప్పారు. నిబంధన మందసము అని పిలువబడిన ఒక పెట్టెలో ఈ పవిత్ర వస్తువులను యాజకులు మోసుకెళ్ళారు. అప్పుడు యొర్దాను నదిని దాటడానికి సైన్యము సిద్ధపడింది. నది చాలా లోతుగా ఉండి, వేగంగా ప్రవహిస్తోంది.
ద్వితీయోపదేశకాండము 10:5; 31: 25– 26; యెహోషువ 1:10–11; 3:1–11
నదిని దాటడానికి ప్రభువు వారికి సహాయం చేస్తారని యెహోషువ ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసాడు.
నిబంధన మందసమును తీసుకొని నీళ్ళలోనికి నడవమని యెహోషువ 12మంది యాజకులతో చెప్పాడు. యాజకులు నీళ్ళలో కాలుపెట్టిన వెంటనే నీళ్ళు రెండు భాగాలుగా విడిపోయాయి.
ఇశ్రాయేలీయులు ఆరిన నేలపై నదిని దాటారు. ఆరిన నేల నుండి 12 రాళ్ళను తీసుకోమని యెహోషువ ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ప్రభువు ఆనాడు చేసిన అద్భుతాన్ని ఇశ్రాయేలీయులకు గుర్తుచేయడానికి అతడు రాళ్ళను నిలబెట్టాడు.
యెహోషువ ఇశ్రాయేలు సైన్యాన్ని కనాను దేశానికి నడిపించాడు. వారు యెరికో అనే పట్టణానికి చేరుకున్నారు. ఆ పట్టణము చాలా బలంగా ఉండి, ఎత్తైన గోడలను కలిగియుంది. యెరికోను ఎలా జయించాలో ప్రభువు యెహోషువకు చెప్పారు. ఆరు రోజులపాటు ప్రతిరోజు ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ నడవాలని ఆయన చెప్పారు. యెహోషువ ప్రభువు చెప్పినట్లు చేసాడు.
నిబంధన మందసమును తీసుకొని ఇశ్రాయేలీయులకు ముందుగా నడువమని యెహోషువ యాజకులకు చెప్పాడు. ప్రతిరోజు సైన్యము యెరికో చుట్టూ నడిచారు మరియు ఏడుగురు యాజకులు తమ బూరలు ఊదారు. మిగిలిన ఇశ్రాయేలీయులందరు నిశ్శబ్దంగా ఉన్నారు.
ఏడవ రోజు సైన్యము యెరికో చుట్టూ ఏడుసార్లు నడిచారు. యాజకులు తమ బూరలు ఊదుతుండగా, అరవమని యెహోషువ ఇశ్రాయేలీయులతో చెప్పాడు. అకస్మాత్తుగా యెరికో గోడలు నేలకూలాయి మరియు యెహోషువ సైన్యము పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది.
ప్రభువు వాగ్దానమిచ్చినట్లుగా ఇశ్రాయేలీయులకు సహాయం చేసారు. యెహోషువ సైన్యము కనాను దేశాన్ని జయించడం కొనసాగించింది మరియు ఇశ్రాయేలీయులు అక్కడ నివసించడం ప్రారంభించారు. ప్రభువు యొక్క అద్భుతాలను, వాగ్దానాలను యెహోషువ వారికి గుర్తుచేసాడు. ప్రభువును సేవించడానికి ఎన్నుకోమని అతడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు.