“సీనాయి పర్వతముపై మోషే,” పాత నిబంధన కథలు (2022)
“సీనాయి పర్వతముపై మోషే,” పాత నిబంధన కథలు
నిర్గమకాండము 19–20; 24; 31–34; ద్వితీయోపదేశకాండము 4–7
సీనాయి పర్వతముపై మోషే
ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటలో జనులకు సహాయపడుట
మోషే మరియు ఇశ్రాయేలీయులు అరణ్యము గుండా ప్రయాణము చేసారు. సీనాయి పర్వతము అనే ఒక పర్వతము యొద్దకు వారు వచ్చారు.
ప్రభువుతో మాట్లాడడానికి మోషే పర్వతముపైకి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులతో ముఖాముఖి మాట్లాడాలని తాను కోరుకుంటున్నానని ప్రభువు మోషేతో చెప్పారు.
ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతము దిగువకు వచ్చారు మరియు పర్వతము చుట్టూ ప్రభువు పొగ మేఘాన్ని సృష్టించారు. ఆ మేఘములో ప్రభువు ఉన్నారు. ఆయన ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఆజ్ఞలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పర్వతం కంపించింది.
నిర్గమకాండము 19:16–19; 20:1–17; ద్వితీయోపదేశకాండము 4:12–13, 33; 5:4–5
ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ప్రభువుతో మాట్లాడమని వారు మోషేను కోరారు, తద్వారా ప్రభువు ఏమి కోరుచున్నాడో మోషే వారికి తెలియజేయవచ్చు.
ప్రభువు నుండి మరిన్ని బోధనలను పొందడానికి అహరోను మరియు 70 మంది ఇశ్రాయేలు పెద్దలను మోషే పర్వతముపైకి తీసుకొని వెళ్ళాడు. ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యారు.
తర్వాత, పెద్దలను విడిచిపెట్టి పర్వతపు శిఖరముపైకి వెళ్ళమని ప్రభువు మోషేతో చెప్పారు. మోషే గైకొన్నాడు. రాతి పలకలపై తన ధర్మశాస్త్రాన్ని మరియు ఆజ్ఞలను వ్రాయడానికి ప్రభువు తన వ్రేలిని ఉపయోగించారు. 40 రోజులపాటు మోషేకు ప్రభువు అనేక విషయాలు బోధించారు.
మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు, ఇశ్రాయేలు జనులు అతడి కోసం ఎదురుచూసి అలసిపోయారు. ఐగుప్తులో కలిగియున్నట్లుగా, వారు పూజించడానికి విగ్రహాలను తయారు చేయమని అహరోనుకు చెప్పారు. అహరోను వారి బంగారం మొత్తం సేకరించి ఒక దూడ విగ్రహాన్ని తయారు చేశాడు.
ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించి, బలులు అర్పించారు. ఐగుప్తు నుండి వారిని విడిపించినది ప్రభువు కాదని, ఆ బంగారు దూడ అని వారు చెప్పారు.
ఇశ్రాయేలీయులు ఒక విగ్రహాన్ని పూజిస్తున్నారని, ఆయనను మరచిపోతున్నారని ప్రభువుకు తెలుసు. అతడు తిరిగి వెళ్ళి, పశ్చాత్తాపపడమని ఆ జనులకు చెప్పాలని ఆయన మోషేను ఆజ్ఞాపించారు.
మోషే సీనాయి పర్వతం నుండి దిగి వచ్చి, ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించడం చూశాడు. అతడు చాలా బాధపడ్డాడు. ప్రభువు వ్రాసిచ్చిన ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను పాటించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మోషే పలకలను పగులగొట్టి, బంగారు దూడను నాశనం చేశాడు. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడడానికి మరియు వారి నిజమైన దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి అతడు సహాయం చేశాడు.
ఇశ్రాయేలీయులను క్షమించాలని మరియు వారితో మళ్ళీ వాగ్దానాలు చేయాలని మోషే ప్రభువును కోరాడు. వాళ్ళకు నాయకత్వం వహించి, బోధిస్తానని మోషే వాగ్దానం చేశాడు.
క్రొత్త రాతి పలకలను తయారుచేసి, సీనాయి పర్వతానికి తిరిగి వెళ్ళమని ప్రభువు మోషేతో చెప్పారు. ప్రభువు ఇశ్రాయేలీయులతో క్రొత్త వాగ్దానం చేశారు మరియు వారికి తన పది ఆజ్ఞలను ఇచ్చారు.
నిర్గమకాండము 20:2–17; 34:1–17, 28; ద్వితీయోపదేశకాండము 6:24–25; 7:12–13