“అమ్మోన్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
అమ్మోన్
వినయముగల ఒక సేవకుడు
అమ్మోన్ మరియు అతని సహోదరులు లేమనీయులకు ప్రభువు గురించి బోధించాలనుకున్నారు. వారు లేమనీయులు నివసించే దేశానికి వెళ్లారు. వారి మార్గములో, వారు ఉపవాసం ఉండి, సహాయం కోసం ప్రభువును ప్రార్థించారు. ప్రభువు వారిని ఓదార్చారు. సహనము కలిగియుండాలని మరియు మంచి మాదిరులుగా ఉండాలని ఆయన వారికి చెప్పారు. వారు బోధించుటకు ఒక్కొక్కరు వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళిరి.
అమ్మోన్, ఇష్మాయెల్ అని పిలవబడిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడి జనులు అతనిని బంధించి రాజైన లమోనై వద్దకు తీసుకొనిపోయిరి. అమ్మోన్ లమోనైతో, తను కొంతకాలము పాటు లేమనీయుల మధ్య నివసించాలనుకుంటున్నట్లు చెప్పాడు. లమోనై అమ్మోన్‌ను ఇష్టపడి అతని స్వతంత్రుడిగా చేసాడు. తన కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకొనవలెనని అతడు అమ్మోన్‌ను కోరెను, కానీ బదులుగా అమ్మోన్ లమోనై సేవకునిగా ఉండుటకు ఎంచుకున్నాడు.
తన మందలను జాగ్రత్తగా చూసుకోమని లమోనై అమ్మోన్‌కు చెప్పాడు. ఒకరోజు, అమ్మోన్ మరియు మరికొందరు సేవకులు తమ మందలు నీటిని త్రాగునట్లు వాటిని తీసుకెళ్లారు. మందలు నీటిని త్రాగుతుండగా, దొంగలు వచ్చి వాటిని చెదరగొట్టారు. లమోనై యొక్క మందలు పోగొట్టుకున్నందుకు తమకు శిక్ష పడుతుందని మిగిలిన సేవకులు భయపడ్డారు.
ఇది ప్రభువు యొక్క శక్తిని చూపించే ఒక అవకాశం అని అమ్మోన్‌కు తెలుసు. అతడు మిగిలిన సేవకులను చింతించవద్దని చెప్పి తప్పిపోయిన జంతువులను కనుగొనడంలో వారికి సహాయం చేశాడు.
దొంగలు మళ్లీ జంతువులను భయపెట్టడానికి తిరిగి వచ్చారు. కానీ ఈసారి, అమ్మోన్ ఇతర సేవకులను నిలిచియుండి జంతువులు పారిపోకుండా ఉంచమని చెప్పాడు.
గొర్రెలను బెదిరిస్తున్న దొంగలను అడ్డుకునేందుకు అమ్మోన్ వెళ్లాడు. దొంగలు అమ్మోన్‌కు భయపడలేదు. వారు అతని కంటే బలవంతులమని భావించారు. అయితే ప్రభువు అమ్మోన్‌కు సహాయం చేస్తున్నాడని వారికి తెలియదు.
అమ్మోన్ దొంగలపై వడిశతో రాళ్ళు విసిరాడు. వారిలో కొందరు చనిపోయారు. ఇది ఇతర దొంగలకు కోపం తెప్పించింది, మరియు వారు అమ్మోన్‌ను చంపాలనుకున్నారు. అమ్మోన్‌ను తమ సొంత రాళ్లతో కొట్టలేకపోయినందుకు వారు ఆశ్చర్యపోయారు. అతడు అంత శక్తిమంతుడని వారు ఊహించలేదు.
దుండగులు తమ లాటీకర్రలతో అమ్మోన్‌తో కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారు ప్రయత్నించిన ప్రతిసారీ, అమ్మోన్ తన కత్తితో వారి చేతులు నరికివేసాడు తద్వారా వారు పోరాడలేరు. త్వరలో, వారు పోరాడటానికి భయపడి, వెంటనే పారిపోయారు.
జంతువులను అమ్మోన్ ఎలా రక్షించాడో సేవకులు లమోనైకి చెప్పారు. లమోనై ఆశ్చర్యపోయాడు. అమ్మోన్ గొప్ప ఆత్మ అని, గొప్ప శక్తిని కలిగియున్నాడని మరియు అతనికి అన్ని విషయాలు తెలుసునని అతడు భావించాడు.
లమోనై అమ్మోన్‌తో మాట్లాడాలనుకున్నాడు, అయితే అతను ఆందోళనగా కూడా ఉన్నాడు.
అమ్మోన్ లమోనైని చూడడానికి వెళ్ళాడు, కాని ఏమి చెప్పాలో లమోనైకి తెలియలేదు. లమోనై ఆలోచనలను తెలుసుకునేందుకు ప్రభువు అమ్మోన్‌కు సహాయం చేశాడు. అమ్మోన్ తాను గొప్ప ఆత్మను కాదని చెప్పాడు. గొప్ప ఆత్మ దేవుడు అని అతను లమోనైతో చెప్పాడు. లమోనై దేవుడు గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు.
దేవుడే ప్రపంచాన్ని మరియు దానిలోని ప్రతి ఒక్కరినీ సృష్టించాడని అమ్మోన్ చెప్పాడు. తర్వాత అమ్మోన్ లమోనైతో దేవునికి రక్షణ ప్రణాళిక ఉందని ఆ ప్రణాళికలో భాగంగా, యేసు క్రీస్తు వస్తారని చెప్పాడు. అమ్మోన్ చెప్పినది లమోనై నమ్మాడు. లమోనై ప్రార్థించాడు మరియు అతనిపై, అతని ప్రజలపై దయ చూపమని దేవుణ్ణి కోరాడు.