“పిల్లలను దీవిస్తున్న యేసు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
పిల్లలను దీవిస్తున్న యేసు
వారి కోసం ఆయన ప్రేమను చూపుట
యేసు క్రీస్తు జనులకు అనేక విషయాలను బోధించారు. వారు నేర్చుకున్న దాని గురించి ఆలోచించడానికి వారికి సమయము అవసరమని ఆయన చూసారు. ఆయన వారికి బోధించిన దానిని అర్ధం చేసుకోవడానికి ఇంటికి వెళ్ళి పరలోక తండ్రికి ప్రార్థించమని ఆయన వారికి చెప్పారు. తరువాత యేసు మరుసటి రోజు మరలా వారిని సందర్శిస్తానని వాగ్దానము చేసారు.
జనులు యేసును కాస్త ఎక్కువ కాలము ఉండాలని కోరారు కనుక వాళ్ళు ఏడ్చారు. యేసు జనులను ప్రేమించారు. వారి విశ్వాసము చాలా బలమైనదిగా ఆయన చూడగలిగారు. ఎవరైనా రోగియైన వారిని లేక ఏవిధంగానైనా గాయపడిన వారిని తన వద్దకు తీసుకొనిరమ్మని ఆయన వారిని అడిగారు. ఆయన వారిలో ప్రతి ఒక్కరిని బాగుచేయాలని కోరారు.
జనులు అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆయన వద్దకు వచ్చారు. యేసు వారిలో ప్రతిఒక్కరిని బాగుచేసారు. వారు చాలా సంతోషించారు. వారు మోకరించి ఆయన పాదాలను ముద్దాడారు.
తన వద్దకు వారి చిన్న పిల్లలను తీసుకొని రమ్మని యేసు వారిని అడిగారు. జనులు వారి పిల్లలను తీసుకొచ్చి యేసు చుట్టూ నేలపై వారినుంచారు.
పిల్లలందరూ ఆయనతో ఉన్న తరువాత, యేసు జనులను నేలపై మోకరించమని అడిగారు. ఆయన కూడ మోకరించారు. తరువాత ఆయన పరలోక తండ్రికి ప్రార్థించారు. ఆయన మాటల్లో రాయలేనంత అద్భుతమైన విషయాలను చెప్పారు. జనులు సంతోషంతో నింపబడ్డారు.
ఆయనయందు వారి విశ్వాసం కారణంగా వారు దీవించబడ్డారని యేసు జనులతో చెప్పారు. యేసు ఎంత ఆనందాన్ని అనుభవించారంటే ఆయన ఏడవటం ప్రారంభించారు.
తరువాత ఆయన పిల్లలందరిని ఒక్కొక్కరినిగా దీవించారు. ఆయన వారిలో ప్రతి ఒక్కరి కోసం పరలోక తండ్రికి ప్రార్థన చేసారు. తరువాత వారి పిల్లల వైపు చూడమని ఆయన జనులను అడిగారు.
దేవదూతలు ఆకాశం నుండి వచ్చి పిల్లల చుట్టూ సమావేశమయ్యారు. దేవదూతలు పిల్లలను దీవించినప్పుడు, పరలోకపు వెలుగు వారిని చుట్టుముట్టింది. మరొక రోజు, యేసు మరలా పిల్లలను కలిసి, దీవించారు. పిల్లలు మాట్లాడేలా కూడా ఆయన దీవించారు. పసిబిడ్డలు కూడ మాట్లాడారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు అద్భుతమైన విషయాలను బోధించారు.