“లీహై మరియు విరిగిన విల్లు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
లియహోనా మరియు విరిగిన విల్లు
ప్రభువు యొక్క సహాయమును వెదకుట
లీహై మరియు ఇష్మాయేలు కుటుంబాలు అనేక సంవత్సరాలు అరణ్యములో ప్రయాణించారు. ప్రభువు వారిని దేశములో మంచి ప్రాంతాలలో నడిపించారు. వారు వేటాడి, దారిలో ఆహారాన్ని సేకరించవలసియున్నది. అది కష్టమైన ప్రయాణము.
వారు దేవుని ఆజ్ఞలు పాటిస్తే ప్రభువు కుటుంబాలను మంచి దేశానికి నడిపిస్తానని వాగ్దానము చేసారు. దేశాన్ని ఎలా వెదకాలో వారికి తెలియదు, కానీ ఆయన వారిని నడిపిస్తారు.
ఒక ఉదయం, లీహై తన గుడారము బయట కంచుతో చేయబడియున్న ఒక గుండ్రని గోళమును చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ గోళము లియహోనా అని పిలవబడింది. లియహోనా లోపల, ఒక సూచిక, సమూహం ప్రయాణించాల్సిన దారి వైపు సూచించింది. కొన్నిసార్లు వారు లియహోనాపై వ్రాయబడిన ప్రభువు నుండి సందేశాలను చూసారు. ప్రభువు ఆవిధంగా వారిని నడిపించారు.
1 నీఫై16:10, 16, 26–29; ఆల్మా 37:38
ఒకరోజు నీఫై వేటాడుతుండగా, అతడి ఉక్కు విల్లు విరిగిపోయింది, అది లేకుండా కుటుంబాలు ఆహారాన్ని పొందలేవు. నీఫై అన్నలు అతడితో, ప్రభువుతో కోపగించారు.
వారందరు చాలా అలసిపోయారు మరియు ఆకలిగా ఉన్నారు. వారిలో కొందరు విచారించారు మరియు ఫిర్యాదు చేసారు. వారు ఆకలితో అలమటించి పోతామేమోనని వారు భయపడ్డారు. లీహై కూడా ప్రభువుకు ఫిర్యాదు చేసాడు.
నీఫై కర్రతో కొత్త విల్లును, బాణమును తయారుచేసాడు. ఆహారాన్ని వెదకడానికి ప్రభువు తనకు సహాయపడతారని అతనికి విశ్వాసమున్నది.
వేటాడటానికి ఎక్కడికి వెళ్ళాలని నీఫై లీహైను అడిగాడు. లీహై ఫిర్యాదు చేసినందుకు విచారించాడు. అతడు పశ్చాత్తాపపడ్డాడు మరియు సహాయం కోసం ప్రభువును అడిగాడు. లియహోనా వైపు చూడమని లీహైతో ప్రభువు చెప్పారు. దానిపై ఒక సందేశము వ్రాయబడింది. వారు ప్రభువునందు విశ్వాసము కలిగియుండి, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మాత్రమే లియహోనా పనిచేస్తుందని కుటుంబాలు నేర్చుకున్నాయి.
వారి ప్రయాణాలందు వారికి సహాయపడటానికి కొన్నిసార్లు లియహోనాపై సందేశాన్ని ప్రభువు మార్చారు. ఎక్కడ వేటాడోలో తెలుసుకోవడానికి లియహోనా నీఫైకు సహాయపడింది. అతడు తినడానికి ఆహారాన్ని తెచ్చాడు, వారందరూ సంతోషించారు. వారు పశ్చాత్తాపపడ్డారు మరియు ప్రభువుకు ధన్యవాదాలు తెలిపారు.